మన రాజ్యాంగం
Our Constitution
Our Constitution
ప్రజల అవసరాలు గుర్తించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచ్, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి మొదలగువారందరూ ఉంటారు.
వీరందరూ ఆయా స్థాయిల్లో ఎలా పరిపాలన చేయాలో తెలియచేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడిన అతి పెద్ద గ్రంథం ఉంది. దానినే “భారత రాజ్యాంగం” అంటారు.
మన దేశంలోని ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. బ్రిటిష్ వలస పాలన నుండి మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత డా॥ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆయన మన దేశానికి మొదటి రాష్ట్రపతి.
1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, మనం ఎలాంటి జీవనం గడపాలి? మన పౌరులకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండాలి? మనలను మనం ఎలా పరిపాలించుకోవాలి? వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఒక పుస్తకం రూపంలో రాసుకోవాలని భావించారు.
ఇందుకోసం ఎన్నోసార్లు సమావేశమై, సుదీర్ఘంగా చర్చించారు. కొంతమంది మేధావులతో రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పరచారు.
ఈ రచనా కమిటీకి ఛైర్మన్ గా డాక్టరు భీంరావు బాబాసాహెబ్ అంబేద్కరును నియమించారు. ఈ కమిటీ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనంచేసి అతి గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇది 1950 జనవరి 26వ తేది నుండి అమలులోకి వచ్చింది.
అప్పటి నుండి భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో పరిపాలన కొనసాగుతున్నది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) గా జరుపుకుంటున్నాం.
రాజ్యాంగంలో మనం అంగీకరించిన నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు పొందుపరచబడ్డాయి. వీటిలో అవసరమయితే కొన్ని అంశాలను మార్చుకోవడానికి వీలు ఉంది. ప్రజలు మార్పులకు సమ్మతి తెలిపినప్పుడే, వారి ఆకాంక్షల మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తారు.
మనది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ లాంటి కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగం లేదు.
మీకు తెలుసా ?
భారత రూపొందిచడానికి రాజ్యాంగాన్ని డా|| బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షులుగా ఉంటే ఈ కింది వారు సభ్యులుగా ఉన్నారు.
వారు: గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎమ్.మున్షి, సయ్యద్ మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవరావు, పి.టి.కృష్ణమాచార్యులు.
రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.
Our Constitution
భారతరాజ్యాంగం – ప్రవేశిక
మన రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ఈ ప్రవేశిక రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం, పరిచయం. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి చెబుతుంది.
THE CONSTITUTION OF INDIA
భారత రాజ్యాంగ ప్రవేశిక
భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,
గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి; పౌరులందరికీ
సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో
స్వాతంత్ర్యాన్ని,
అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చుటకు,
వారందరిలో పెంపొందించుటకు;
వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ
సౌభ్రాతృత్వాన్ని పెంపొందిచడానికి,
1949 నవంబర్, 26న
మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపికచేసికొని శాసనంగా
రూపొందించుకున్న
ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం.
Our Constitution
ప్రవేశికలోని పదాలు వాటి భావనలు
భారత రాజ్యాంగ ప్రవేశిక ఎందుకు గొప్పదైనదో అది మనకు ఏమి సందేశమిస్తున్నదో, ఆ ప్రవేశికలోని పదాలకు అర్థమేమిటో, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం!
(We, the people of India … that is ) భారత ప్రజలమైన మేము… అంటే
‘భారత ప్రజలమైన మేము’ అంటే మన భారతదేశంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరు అని అర్థం.
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం… అంటే
మన భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవాలని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుని ప్రవేశికలో పొందుపర్చారు.
సర్వసత్తాక
సర్వసత్తాక అనగా మనదేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కాని, మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీల్లేదు. కానీ మనం వాణిజ్యం, విద్య, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటాం.
సామ్యవాదం
సామ్యవాదం అనగా దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి అనుభవించాలి. మనకున్నది ఇతరులతో పంచుకోవాలి. అందరికీ సరిపడు ఆహారం పొందడం, అందరు ఆరోగ్యంగా ఎదగడం, అందరూ చదువుకోవడం. ఎలాంటి వివక్షత లేకుండా అందరు అన్ని సౌకర్యాలను సమానంగా పొందడం అవసరం. ఈ సమానత్వం కోసం మనం అందరం పనిచేయాలి. సహాయపడాలి. అందరు బాగుంటే మనం బాగుంటాం అని అనుకోవాలి.
లౌకికరాజ్యం
లౌకికరాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉండదు. ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మత ప్రతిపాదిక మీద ప్రభుత్వాలు ఏర్పడవు.
” భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. ముస్లింలు 13%, క్రైస్తవులు 2% ఉన్నారు. ఇతరులు అనగా సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఏ మతాన్ని విశ్వసించనివారు కూడా ఈ దేశంలో ఉన్నారు. బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతం భారతదేశంలోనే పుట్టాయి. బౌద్ధమతం ఇతర దేశాలకు వ్యాపించింది.”
ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం
ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అనగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. రాజులు, రాణులు లేకుండా పరిపాలన ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నవారు ప్రభుత్వాన్ని నడుపుతారు. ప్రజాస్వామ్యం అనగా ప్రజలకొరకు ప్రజలచేత ఏర్పడిన ప్రభుత్వం అన్నమాట. ఇందుకోసం మనం ఓటువేసి మన నాయకులను ఎన్నుకుంటాం.
మనకోసం పనిచేసే, మంచితనం కలిగిన, నిస్వార్థపరులైన వారిని మనం ఓటువేసి ఎన్నుకోవాలి. వారే మన ప్రభుత్వం. వారు ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగంలో రాసుకున్న నిబంధనలకనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలి. వారు ప్రజల బాగుకోసం నిరంతరం ఆలోచించాలి. ప్రయత్నించాలి. వారు ప్రజలను కలుసుకుని, వారి కష్టసుఖాలను విచారించాలి. వారికి సహాయం చేయడం గొప్పగా భావించాలి.
మీకు తెలుసా ?
మనం ఎన్నుకున్న నాయకులు చట్టాలు చేస్తారు. చట్టాలు పార్లమెంటులో రూపొందుతాయి. పార్లమెంటులో రాజ్యసభ, లోక్ సభ ఉంటాయి. లోకసభకు 543 పార్లమెంటు సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. ఇద్దరు సభ్యులను ఎన్నికలు లేకుండా ప్రతిపాదన (నామినేటు) చేస్తారు. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు. 12 మందిని ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. పార్లమెంటులో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790.
మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి ఉన్నాయి. 119 మందిని ఓట్ల ద్వారా శాసన సభకు ఎన్నుకుంటారు. వీరిని శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఏ.) అంటారు. శాసన మండలికి 40 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని శాసన మండలి సభ్యులు (ఎమ్.ఎల్.సి.) అంటారు.
మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఉంటుంది. తన ఇష్ట ప్రకారం ఎన్నికలలో పోటీచేసే వ్యక్తికి ఓటువేయాలి.
సమన్యాయం – సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
అందరూ విద్యను సమానంగా పొందడం, అందరికీ ఒకేరీతిలో చట్టాలను అమలుపరచడం, అందరికీ సమానమైన గౌరవం ఇవ్వడం, సమానమైన హోదా కలిగిఉండడం, అందరూ సమానంగా అవకాశాలను పొందడం, అందరూ తమ హక్కులను సమానంగా అనుభవించడం, అందరకీ సమానమైన ప్రయోజనాలు లభించడం, అందరూ ఆరోగ్యంగా ఉండడం. ఇలా అన్ని విషయాలలో అందరూ సమానమే.
మగ, ఆడ, వివిధ మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా ఒకరు ఎక్కువ వేరొకరు తక్కువ అని కాకుండా అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి. గౌరవంతో చూడాలి. అందరికి నివాసం, విద్య, వైద్య, ఉపాధి, అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది.
సమానత్వం
జాతి, కులం, మతం, భాష, నివసించే ప్రదేశంతో సంబంధం లేకుండా అందరు ప్రజలను సమానంగా చూడాలి. గౌరవించాలి. కొందరికి ఎక్కువ గౌరవం ఇవ్వడం, ఇంకొందరిని తక్కువగా చూడడం చేయకూడదు. ఆడ, మగ ఇద్దరిని సమానంగా చూడాలి. సమాన అవకాశాలు ఇవ్వాలి. అందరు ప్రజలు, ఆరోగ్య వంతమైన మంచి జీవనం గడపడానికి సమాన అవకాశాలు ఇవ్వాలి. అభివృద్ధిని అందరికి పంచాలి.
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వేచ్ఛ
రాజ్యాంగం మనకు అనేక స్వేచ్ఛలను కల్పించింది. అవి: మాట్లాడే స్వేచ్ఛ, రాసే స్వేచ్ఛ, భారత దేశంలో ఎక్కడికైనా భయంలేకుండా వెళ్ళగలిగే స్వేచ్ఛ, భయంలేకుండా ఇష్టమున్న చోట నివసించే స్వేచ్ఛ, స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ, నచ్చిన మతాన్ని ఆచరించగలిగే స్వేచ్ఛ ఇలా మనకు రాజ్యాంగం అనేక రకాలైన స్వేచ్ఛలను ఇచ్చింది. మనం మనకు ఇష్టమైన చదువును చదువుకునే స్వేచ్ఛకూడా ఉంది. ఇతరులకు హాని కలిగించకుండా ఉన్నంత వరకు పై వన్నీ చేయడానికి మనకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది.
వ్యక్తిగత గౌరవం, దేశసమైక్యతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం
మన రాజ్యాంగం ప్రకారం అందరం సమానమైన గౌరవాన్ని పొందగలగాలి. సమాజంలో మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మనం అందర్నీ ఒకే రీతిలో గౌరవిస్తున్నామా? లేక కొంత మందికి ఎక్కువ గౌరవం, మరికొంతమందికి తక్కువ గౌరవం ఇస్తున్నామా? ఇంకొంతమందికి అసలు గౌరవాన్ని కూడా ఇవ్వరు కదూ!
మనం అందరం ఒక కుటుంబంలోని సభ్యులుగా ప్రేమతో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళుగా మెలగాలి. ఒకరి గురించి మరొకరు బాధ్యత వహించాలి. పరస్పర సహాయం చేసుకోవాలి. ప్రజల మతాలు, భాషలు, సంస్కృతి ఏవైనా, మన మందరం కలసి మెలసి ఉండి, మన భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. భిన్నత్వంలో ఏకత్వం ద్వారా మన దేశాన్ని ఐక్యతతో బలోపేతం చేసుకోవాలి.
సౌభ్రాతృత్వం
సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. భారతీయులందరం ఒక కుటుంబంలోని వ్యక్తులవలే ఆప్యాయతతో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళవలె మెలగాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మంచిగా కలిసి జీవించాలి. భాషలు, మతాలు, ఆహారం వేరైన అందరం కలిసిమెలిసి ఉండాలి.
భారత రాజ్యాంగం
Our Constitution
ఈ విధంగా రాసుకున్న రాజ్యంగాన్ని రాజ్యంగ పరిషత్ 26 సవంబర్, 1949 నాడు ఆమోదం తెలిపింది. 24 జనవరి, 1950 నాడు రాజ్యాంగ సభ సభ్యులు అందరు సంతకం చేసారు. రెండు రోజుల తరువాత అనగా 26 జనవరి 1950 నుంచీ మనం ఆమోదించిన రాజ్యాంగంను అనుసరించి, మనలను మనం పరిపాలించుకుంటున్నాం.
జనవరి 26ని గణతంత్ర దినం లేదా రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహిస్తారు. ఇది ఒక జాతీయ పండగ. ఈ రోజు మన దేశంలో గ్రామ గ్రామంలో, అన్ని సంస్థల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు.
మనం, మన రాజ్యాంగంలో చేసుకున్న వాగ్దానాలను, నియమాలను అర్థం చేసుకొని వాటిని అనుసరించాలి. అందరు సంతోషంగా ఉండేట్టు చూడాలి. రాజ్యాంగం అందరు పిల్లలకి విద్య, ఆరోగ్యం, అభివృద్ధిలో సమాన అవకాశాలను, స్వేచ్ఛను కల్పించింది. దీనిని గౌరవించి, మనమందరం ఆచరించాలి.
కాని కొందరు పిల్లలకు సరియైన ఆహారం లేదు. కొంతమంది బడికి వెళ్ళడం లేదు. బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. బాలలు అందరు ఆరోగ్యంగా లేరు. ఎందుకో ఆలోచించండి. పిల్లలందరికి మంచి ఆరోగ్య వంతమైన జీవనం లేకుంటే బడికి వెళ్ళకుంటే మరి రాజ్యాంగం ద్వారా కల్పింపబడే సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే హక్కులను వారు పొందలేరు. కాబట్టి మనం నిజాయితీ, ధర్మం, సేవాభావంతో అందరి జీవితాలు బాగుపడేట్లు చేయాలి. మనం బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించాలి. చెట్లు నాటాలి. సంరక్షించాలి. ఇతర జీవులను, పక్షులను ప్రేమతో చూడాలి. ఆహారం ఇవ్వాలి. వాటిని సంరక్షించాలి. మనం నివసించే ప్రదేశాలను, చెరువులను, కొండలను నదులను జలాశయాలను, అడవులను రక్షించుకోవాలి. వాటిని కాలుష్యం చెయ్యకుండా చూడాలి. ముందుగా మనం ఆచరించాలి. అప్పుడే ఇతరులకు చెప్పాలి.
హక్కులు, బాధ్యతలు
భారత రాజ్యాంగం మనకు హక్కులను, బాధ్యతలను కల్పించింది. పనిచేసే హక్కు, వాక్ స్వాతంత్ర్యం హక్కు, మత స్వాతంత్ర్యం హక్కు పీడనం నుండి నిరోధించబడే హక్కు ఓటు హక్కు సంఘాలను ఏర్పరచుకొనే హక్కు, విద్యను పొందే హక్కు మొదలగు హక్కులను కల్పించింది. అట్లే మనం నెరవేర్చవలసిన బాధ్యతల్ని గురించి కూడా తెలిపింది.
ప్రాథమిక బాధ్యతలు
A) రాజ్యాంగానికి లోబడి దాని ఆశయాలను, హక్కులను, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించుట.
B) జాతీయ పోరాటానికి, స్వాతంత్ర్యం సముపార్జనకు దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించుట.
C) భారతదేశపు ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుట.
D) దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడుట.
E) మత, భాష, ప్రాంతీయ వర్గవైషమ్యాలు లేకుండా దేశ ప్రజలందరిలోను ప్రశాంత వాతావరణం కలుగజేయడం. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలను అంతమొందించుట.
F) దేశ సంస్కృతిని కాపాడుట.
G) సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, సదులు, వస్యమృగాలను పరిరక్షించి అభివృద్ధిపరచుట.
H) శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణాధోరణిని, సంస్కరణను అభివృద్ధిపరచుట.
I) ప్రభుత్వ ఆస్తిని కాపాడుట, హింసను విడనాడుట.
J) జాతి సర్వతోముఖాభివృద్ధికి వ్యక్తిగతంగా, సమిష్టిగా కృషి సల్పుట.
హక్కులను అనుభవించడంలో కొంతమంది వివక్షతకు గురౌతుంటారు. అనగా అందరూ అన్నీ అనుభవించలేరు.
అంటే అందరూ సమానంగా గౌరవాన్ని పొందకపోవడం, స్వేచ్ఛను కలిగి ఉండకపోవడం, సమానమైన గుర్తింపును పొందకపోవడం, చదువుకొనే అవకాశాలు పొందకపోవడం మొదలగునవన్నీ వివక్షత కిందికి వస్తాయి. ఇలా వివక్షతకు గురికాకుండా అందరూ తమ హక్కులను అనుభవించాలి. అభివృద్ధి చెందాలి.
Our Constitution
5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here