Advertisements

Apoorva Chintamani, who beheaded 1000 kings , Episode – 1

Apoorva Chintamani
Apoorva Chintamani
Advertisements

సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి

Apoorva Chintamani

మనిషితో పాటే మనోవేదన కూడా పుడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా బాధపడకుండా ఉండని మనిషి లేడు. అలాంటివాడు భూమిమీద ఇంతవరకూ పుట్టలేదు. బహుశా పుట్టక పోవచ్చు కూడా. మనిషి అంటే మనస్సు. మనస్సంటే చింత. చింత అంతమయ్యేది చితి మీదే.

గంజి లేక బాధపడేవారు కొందరైతే .. గంజిలోకి ఉప్పులేక బాధపడేవారు మరికొందరు. ఆకలితో అలమటించేవాళ్లు కొందరైతే.. అజీర్ణంతో బాధపడేవారు మరికొందరు. భార్యలేక చింతించేవారు కొందరు భార్యవల్ల బాధించబడేవారు కొందరు. ఐశ్వర్యం లేదే అని కొందరు ఏడుస్తూంటే.. ఎందుకొచ్చిన తంటారా అనుకునే వాళ్ళు మరికొందరు. పిల్లలు లేరని బాధ కొందరికి, పిల్లల వల్ల బాధ మరి కొందరికి, పదవిలేదనే పరితాపం కొందరికి; పదవి వల్ల యిబ్బందులు మరి కొందరికి. ఏదేనా సరే.. ఉన్నా బాధే, లేకపోయినా బాధే. భూమ్మీద – దుఃఖం లేని సుఖం లేదు. ఐతే.. మనిషనే నటుడు, యదార్థం దాచుకుని మరో ముఖం ప్రదర్శిస్తూంటాడు. అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు. ప్రతివారూ తాను తప్ప అందరూ బాగానే ఉన్నారనుకుంటారు. కాని పైకి కనిపించే మనిషివేరు. అసలు మనిషి వేరు.

ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం:-Apoorva Chintamani

కీర్తికాముడు మగధ దేశానికి రాజు. తన తెలివితేటలు, బుద్ధిబలంతో శత్రువులను తొలగించుకున్నాడు. యుద్ధభయాలు లేకుండా చేసుకున్నాడు తన సామ్రాజ్యాన్ని పెంచుకుని సుస్థిరం చేసుకున్నాడు. కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్యంలో డబ్బు, బంగారం, వస్తులు, వాహనాలకి కొదువే లేదు. పాడి పంటలకు కరువులేదు.  రాజ్యం – లక్ష్మీ దేవి నివాసమై కలకలలాడుతోంది.

అతని రాజధాని అయిన కుండిన నగరంలోని కట్టడాలు శిల్ప  చమత్కారానికీ, నాగరికతకీ నెలవులు. నగరనిర్మాణం అద్భుతం. అది చూసిన వారు – దేవేంద్రుడి పట్నం అంతకంటే ఘనంగా ఉంటుందంటే నమ్మరు.

మగధ రాజ్యం- పేరు కయితే ప్రజా రాజ్యం కాదు. కాని. ప్రజలలో తిరుగుబాటులు కాని అల్లర్లు కాని మచ్చుకైనా కనిపించవు. ఎందుచేత అంటే-ఆ రాజు తన ప్రజలని కన్న బిడ్డల్లాగే చూసుకుంటాడు. అన్నానికీ, వస్త్రానికీ కరువులేని.. ప్రతి ఒకరికీ చేసేందుకు పనీ, ఉండేందుకు గూడు ఉండే దేశంలో అల్లర్లు ఎందుకుంటాయి?  కూడూ, గూడూ లభిస్తూ.. ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. పరిపాలన స్థిరంగా సాగుతోంది. రాజుకి తగినవారే మంత్రులు. మంత్రి వర్గం ప్రజల సుఖాన్నే లక్ష్యంగా చేసుకుంది. లంచగొండితనం అనేది లేదు.

కీర్తికాముడు స్వార్థం లేని ధర్మరాజని.. ఆ రాజ్య ప్రజలే కాక ఇతర  దేశ ప్రభువులూ ప్రజలు కూడా అనుకునేవారు. అతను చాలా సుఖంగా ఉన్నాడని భావించేవారు. కాని –

కీర్తికాముడికీ విచారం ఉంది. అతనికే కాదు కుండిన నగరపు కోటలోని అందరికీ ఆ విచారంతోనే మనసుకి శాంతి కరువైంది. ఎవరి ముఖంలోనూ ఆనందమనేదే లేదు. ఎవరి ముఖం చూడబోయినా వెలవెల బోతూనే ఉంది. పట్టమహిషి మంజులాదేవి కంటికీ మంటికీ ఏకధారగా కన్నీరు కారుస్తూంటే కీర్తికాముడు సైతం ఆమెను ఓదార్చలేకపోతున్నాడు. అతని గుండెల్లోనూ అల్లకల్లోలమైన సముద్రంలా దఃఖం ఎగసిపడుతూంది. మగవాడు కనుక ఆ కన్నీటి కెరటాలను బయటకు రానివ్వకుండా బిగబట్టుకుంటున్నాడు. ఆపుకుంటున్నాడు.

రాత్రి గడుస్తూంది. కోటలోని నగారా ఒక గంటకొట్టింది.

గదిలో… మృదువైన శయ్యమీద పన్నెండేళ్ళ బాల.. పోత పోసిన బంగారు బొమ్మలా.. శిల్పిచెక్కిన సుందరశిల్పంలా.. స్పృహలేకుండా పడి ఉంది. ఆ మంచం మీదనే కూర్చుని మంజులాదేవి ఒక చేతిని కూతురి వొంటి మీద వేసి.. అపరిమితమైన దుఃఖం అనుభవిస్తోంది.

ఆ తల్పానికి దగ్గరలో.. ఒక ఆసనం మీద కీర్తికాముడు చేష్టలుడిగి కూర్చున్నాడు. ప్రధానమంత్రి ధీమంతుడు, కొందరు రాజోద్యోగులూ కొంచెం -దూరంలో ముఖాలు చిన్నబుచ్చుకుని నిలుచుని ఉన్నారు. గదిలో ఒకవేపు ఇద్దరు రాజవైద్యులు మందులు నూరుతూంటే దాసీ జనాలు వారికవసరమైనవి అందిస్తున్నారు.

ఒక రాజవైద్యుడు తమలపాకులో చిటికెడు ఔషధం వేసి తీసుకురాగా రెండవ వైద్యుడు వెండి గ్లాసుతో నీళ్ళు తెచ్చాడు.

“అమ్మా! ఈ మందుకి తిరుగుండదు -” అన్నాడు. ఇద్దరు వైద్యులలోనూ ఒకడు – రాణిగారిని చూస్తూ.

“దీనిని మనం అమ్మాయిగారి చేత మింగించగలిగామో.. మందు కంఠం దిగడమేమిటీ, కళ్ళు తెరిచారే..” అన్నాడు రెండవ వైద్యుడు.

మంజులాదేవి ఆ ఔషధాన్ని తాను అందుకుని కుమార్తె నోటిలో వెయ్యబోయింది. కాని ఆమెనోరు తెరవలేదు. అప్పుడు బిడ్డ నోరు విప్పడానికి రాజు ప్రయత్నించాడు. పళ్ళు గిట్టకరచుకుని ఉన్నాయే తప్ప నోరు పెగలలేదు. అది చూసి వైద్యులు నిరాశపడిపోయారు. రాణిగారి కళ్ళల్లోంచి నీళ్ళు ఉబికాయి. కీర్తికాముడు నిరాశతో ఆసనంలో కూలబడిపోయాడు.

“ఇంకేది దారి? ఇప్పుడేం చెయ్యాలి నాథా?” వొణుకుతున్న గొంతుకతో అడిగింది రాణి.

రాజు నోటివెంట మాట రాలేదు.

“వారం రోజులుగా యిదే పరిస్థితి. ఐనా యీ పూట మరీ హీనంగా ఉంది. మందు కూడా మింగకపోతే..” అన్నాడు మంత్రి బాధగా.

“ఏదో ఒకటి వేగంగా ఆలోచించండి. నా బిడ్డ బతికే దారి చూడండి. నా తల్లి కోసం ఎన్ని నోములు నోచాను! ఎన్ని యాత్రలు చేశాం! దేవుడు వరమిచ్చాడని మురిసిపోతూంటే.. ఇంతలోనే యిలా మిన్ను విరిగి మీద పడింది. మాట్లాడరేం నాథా! త్వరపడండి.. ” శోకించింది మంజులాదేవి.

రాజు ఒక నిట్టూర్పు వదిలి “ ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. -” అన్నాడు.

“దేశంలోని గొప్ప గొప్ప వైద్యులందరూ వచ్చారు. ప్రయత్నాలు చేశారు. రోగ నిర్ధారణే కాలేదు. పాము కాటు అని ఒకరూ, అపస్మారకమని కొందరూ, మూర్చ అని మరికొందరూ.. అన్నిటికీ తమ ప్రయత్నాలు తాము చేశారు తల్లీ…” అని మంత్రి అంటూంటే,

“అయ్యో! మంత్రీ! ఐతే యిక నా తల్లి నాకు దక్కే యోగంలేదా? నా తల్లిలేని బతుకు నాకనవసరం. చెడ్డమాట చెవిన పడకముందే నేను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం మంచిది.” అని రోదించింది రాణి. అందరూ కంగారు పడ్డారామాటలకి.

“కొంచెం శాంతం వహించండి దేవీ!” అని వారించబోయాడు మంత్రి. “లోకంలో నా బిడ్డని రక్షించగల వైద్యుడే లేనప్పుడు.. నా తల్లి వ్యాధి నయం చెయ్యగల ఔషధమే కరువైనప్పుడు.. ఇక నా కెక్కడ శాంతి? ఎందుకొచ్చిన బతుకునాది? ఎంత రాజ్యసంపద ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా అన్నీ వృధా. లేకలేక కలిగింది ఒక్కబిడ్డ. ఆ ఒక్క బిడ్డకీ కూడా కరువు పడే కర్మ కాబోలు నాది.” అని ఆమె కుమిలి కుమిలి ఏడవసాగింది.

అది చూడలేక వైద్యులిద్దరూ రోగి నోటిని విప్పి మండు మింగించడానికి గట్టిగా ప్రయత్నించారు. కాని అదేం కర్మో.. పళ్ళు గిట్టకరచుకునే ఉన్నాయి తప్ప గాలి చొరడానికయినా సందివ్వలేదు.

తమ ప్రయత్నాలు వృధా కావడంతో – “సూది మొనపాటి మందు లోపలికి పోతే మాటదక్కేది. కాని ఏంలాభం? పట్టకారు పెట్టి లాగినా పళ్ళు సందివ్వడంలేదు. ఎంతమంచి ఔషధంఉండీ ఏంలాభం?”అన్నారు వైద్యులు.

మంజులాదేవి వారి మాటలకు చిరాకుపడుతూ – “చాలు, ఇక మీ ప్రగల్భాలు ఆపండి. వారం కిందటి పరిస్థితి ఇది కాదుగా. అప్పుడు మీరూ మీ ఔషధాలూ ఏమయ్యాయి?” అంది నిష్ఠూరంగా,

వైద్యులు నోరుమూసుకున్నారు. “బిల్వనగరం మా అన్నగారికి కబురు పంపలేదా ప్రభూ?” అడిగింది రాణి.

కీర్తికాముడు ధీమంతుడి వైపు చూశాడు.

“మూడు దినాలకిందటే చేయించాం దేవీ. ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ – వారి ఆస్థానంలో ఉండే ధన్వంతరులను వెంటబెట్టుకుని రావలసిందిగా ధర్మపాల మహారాజుగారిని కోరుతూ.. వారిని తీసుకురావడానికి మనుషులని పంపాను. వారు ఈ పాటికి రావలసిందే.” అని చెప్పాడు మంత్రి వినయంగా.

కీర్తికాముడికి ఆమాటలు వినిపించలేదు. కుమార్తె పరిస్థితి అర్థం కాక అతని గుండె చెదరి ఉంది.

అంతలో – వాకిట్లో గుర్రాల అలజడి అయింది. ఎవరో వచ్చి ఉన్నారునుకున్నారు ఆ గదిలో వారు. ఒక పరిచారకుడు వచ్చి –

“బిల్వనగరం నుంచి ధర్మపాల మహారాజుగారు పరివారంతో విచ్చేసి కోటలో ప్రవేశించారు.” అని చెప్పాడు.

ఆపద సమయంలో వచ్చిన సోదరుడిని కలుసుకుందుకు దేవి తహతహలాడింది. వచ్చినవారిని తక్షణమే ప్రవేశపెట్టమని కీర్తికాముడు పరిచారకులను ఆదేశించాడు.

కుండిన నగరానికి బిల్వనగరం వారం రోజుల ప్రయాణం. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. మంజులాదేవికి స్వయానా అన్నగారు. మేనకోడలు స్వస్థత చెడి ఉందని తెలియడమేమిటి, వెంటనే తన కొడుకు ఆనందకుమార్ తోనూ, ఆస్థాన వైద్యులలో దిట్ట అయిన ధన్వంతరి తోనూ బయలుదేరాడు. మామూలుగా వారం రోజులు చెయ్యవలసిన ప్రయాణాన్ని, పగలూ, రాత్రీ ఆగకుండా చేసి మూడు దినాలలో వచ్చి కుండిన నగరం చేరుకున్నాడు.

ఆ గదిలోకి ఆనందుడే ముందరగా ప్రవేశించాడు. “చింతామణికెలా ఉంది. అత్తయ్యా?” ఆత్రంగా అడిగాడు. అంతలో ధర్మపాలుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే – “మా పరిస్థితి అంధకారమయమైపోయింది చూడు.. అన్నయ్యా… బావ ఆనందుడు వచ్చాడనగానే పరుగుపరుగునపోయి ఒళ్ళో వాలేది నా చిట్టితల్లి. ఇప్పుడు .. వారం రోజుల నుంచి మూసిన కన్ను తెరవటం లేదు నా బిడ్డ.” అంటూ వలవల ఏడిచేసింది రాణి.

ఆ మాటలకు కళ్ళు చెమ్మగిల్లగా ఆనందుడు ముఖం మరో వేపుకి తిప్పేసుకున్నాడు.

కీర్తికాముడు ఒకవేపున, మంజులాదేవి మరోవేపున – “బావా, మావయ్యా వచ్చారు, కళ్ళు విప్పి చూడమ్మా..” అని కుమార్తెను కదుపుతూ హెచ్చరించారు. కాని ఆమె కదలనూ లేదు, కళ్ళు విప్పనూలేదు.

“ఉన్నట్లుండి ఇదేం గ్రహచారం?” అని ధర్మపాలుడు తనతో వచ్చిన ధన్వంతరి వేపు చూశాడు. ఆ వైద్యశిఖామణి వెంటనే చింతామణి నాడినందుకుని పరీక్షించాడు. కాని అతని ముఖంలో వికాసం కాని ఆశ కాని కనిపించలేదు. ఆమె నోరు తెరవాలని ప్రయత్నించాడు. కుదరలేదు.

“ఒంటి మీద స్పృహ లేకపోయినా.. యివాళి వరకూ వేసిన మందులన్నీ మింగుతూనే ఉంది. బిడ్డ. ఇవాళే యిలా ఐపోయింది.” అన్నాడు కీర్తికాముడు బాధగానూ భారంగానూ.

“అసలు ఈ వ్యాధి రావడం ఎలా వొచ్చిందో వివరాలు చెప్పండి.” అని వైద్యుడు అడిగాడు.

అందుకు రాజు –

“ఎనిమిది రోజుల కిందట – అమ్మాయి పన్నెండో జన్మదినోత్సవం ఎంతో వేడుకగా చేశాం -” అని చెబుతూండగా..

“ఔను.. పదిహేను రోజుల కిందట మీరు పంపిన శుభలేఖ అందుకున్నాం కాని.. రాచకార్యాల తొందరలో ఎవరమూ రాలేకపోయాం. అప్పటి వరకూ కులాసాగానే ఉందన్నమాట. ఆ..తరవాత?” అడిగాడు ధర్మపాలుడు.

“ఆవేళ సాయంకాలంవరకూ కూడా కులాసాగానే ఉంది. వేడుకలూ, వినోదాలూ, విందులూ అతిఘనంగా జరిగాయి. ఆ జన్మదినానికి ప్రత్యేకంగా మణులహారం కొన్నాను రెండు లక్షలు పెట్టి. అది ఎంతో బాగుందని మురిసి పోయింది కన్నతల్లి. రోజంతా దానిని వదిలి పెట్టలేదు. వేలాది బంధుమిత్రులు ఉత్సవంలో పాల్గొన్నారు.” అని చెబుతూంటే కీర్తికాముడి కంఠం శోకంతో పూడుకుపోయింది.

అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు.

“Apoorva Chintamani తరవాతి బాగంలో ఏం జరిగిందో చూదాం “!

Apoorva Chintamani

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here