సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి
Apoorva Chintamani
Apoorva Chintamani అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు.
“రాజకుమారి జన్మదినోత్సవానికి ఏతెంచిన బంధుమిత్రులు చీకటిపడే వేళకు వెళ్ళిపోయారు. చక్కగా అలంకరింపబడిన చింతామణి, శోభనీ కొందరు చెలులనీ వెంటబెట్టుకుని పూలతోటలోని తూగుటుయ్యాల మీద ఊగుతూ.. దానిమీంచి కిందపడిందట. పడుతూ – భయంతో కెవ్వు మని ఒక కేకమాత్రం వేసిందట. అంతే.. పడిన తరవాత ఇక ఆమెకి వొంటి మీద స్పృహ లేదు. చెలులు పరుగు పరుగున వచ్చి కోటలో యీ వార్త చెప్పారు. తక్షణం ప్రభువు, దేవిగారు, మేము పరుగెత్తి అక్కడికి వెళ్ళాం.
రాజకుమారి వొంటి మీద తెలివిలేకుండా పడుంది. నురగలు కక్కుతూంది. మాటాలేదు, చూపులేదు. చేతుల మీద తీసుకొచ్చి పాన్పుమీదపడుకోబెట్టాము. అప్పటినుంచీ చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. సమర్ధులన్న వైద్యులనెందరినో రప్పించాము. ఎవరి వల్లా కాలేదు. ఈ రాత్రి పరిస్థితి మరీ విషమంగా ఉంది.”
బిల్వనగరం నుంచి వొచ్చిన ధన్వంతరి చింతామణిని పరీక్షించడం ముగించి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి – “ఉయ్యాల ఊగుతూ ఎంత ఎత్తునుంచి కిందపడి ఉంటుందో చెప్పగలరా?” అని అడిగాడు.
ఆ విషయం తెలియక వారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. “దగ్గరగానే ఉంది కనుక శోభకి తెలిసి ఉంటుంది.పిలవండి -”అంది మంజులాదేవి.
“శోభ ఎక్కడుంది?” అడిగాడు కీర్తికాముడు.
“దానికి చింతామణంటే ప్రాణం. నిముషం వొదలదు. ఈ వారం రోజులుగా దానికి నిద్రాహారాలులేవు. అలసి సొలసి ఏ మూలో పడుకుని ఉంటుంది.” అని ఆమె పరిచారికలను వెళ్ళి చూడమంది.
వాళ్ళు వెళ్ళి నిద్రమత్తులో ఉన్న శోభని పిలుచుకువచ్చారు.
“అక్కకెలా ఉంది? కళ్ళు తెరిచిందా?” ఆత్రంగా అడిగింది, శోభ కళ్ళు నులుపుకుంటూ.
“తెరుస్తుంది అమ్మాయీ! ఇలా చూడు. ఆవేళ మీరంతా ఉయ్యాలలూగుతున్నప్పుడు చింతామణి ఎంత ఎత్తు నుంచీ పడిందీ?” అడిగాడు ధన్వంతరి దానిని బుజ్జగిస్తునట్లు.
శోభ కొంచెం ఆలోచించి.. “అబ్బో! చాలా ఎత్తు నుంచే పడింది. అప్పుడు చింతామణి ఒక్కతే ఊయలమీద ఉంది. వెనక కొందరు పిల్లలు నిలుచుని బలంగా ఊపుతున్నారు. కొందరం ఎదురుగా నిలుచుని కిలకిల నవ్వుతున్నాం..” అని వర్ణించి చెబుతూంటే –
ధన్వంతరి – “నేనడుగుతున్నది ఆమె ఎంత ఎత్తునుంచి పడింది అని” అన్నాడు.
“అదా!.. అప్పుడు.. ఉయ్యాల.. తాటి చెట్టులో సగం ఎత్తుకి లేచింది. అప్పుడు.. అక్కడినుంచి పడింది”
శోభమాటలు విని అతను మళ్ళీ చింతామణి నాడిని పరీక్షించాడు. కళ్ళ రెప్పలు వేళ్ళతో ఎత్తి చూశాడు. ఆమె నోరు తెరవబోయాడు కాని ప్రయోజనం లేకపోయింది.
అతని వేపే ఆదుర్దాగా చూస్తున్న వాళ్ళందరూ – “ఏమండీ! అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ఆశ ఉందా?” అని అడిగారు.
“చెప్పడం కష్టం. నాడి ఎక్కడో కింద నీరసంగా కొట్టుకుంటూంది. అంత ఎత్తునుంచీ పడినా దెబ్బలేమీ తగలలేదు. ఎందుకనో?”
ధన్వంతరి ప్రశ్నకి – “కింద అంతా ఇసక.” అని చెప్పాడు మంత్రి. “శరీర భాగాలకు ఎటువంటి ముప్పూలేదు. కాని.. ఎత్తు నుంచి పడడం వల్ల మెదడు దెబ్బతింది. ఔషధంమింగితే ఏమైనా చెయ్యవచ్చు. కాని.. పళ్ళు గిట్టకరుచుకు పోడంతో అలాటి ఆశ ఏమీ లేదు- ” అంటూనే ఆ వైద్యుడు తన సంచిలోంచి కొన్ని మూలికలు తీసి.. వాటినుంచి పసరుపిండి ఆమె నుదుటి పై పట్టి వేశాడు. “ఈ రాత్రి గడిస్తే గండం గడిచిందను కోవచ్చు. ”
అతని మాటలు పూర్తవుతూండగానే కోటలోని నగారా మూడు గంటలు కొట్టింది. అందరూ నిరాశలో ములిగిపోయారు. నిముషమొక యుగమైనప్పుడు – ఇంకా మూడు గంటలు గడవడమంటే సంభవమా? ధర్మపాలుడి ఆస్థాన వైద్యుడు దేనినైనా సాధించగలడన్న ఆశతో అంతవరకూ గడిపారు. కాని ఇప్పుడు ఆ ఆశకూడా అంతరించి పోయింది. అతను పెదవి విరిచేశాడు. ఇక భారం భగవంతుడి మీద వేయడం తప్ప వేరే మార్గమేముంది? – అనుకున్నారందరూ.
అతికష్టం మీద మరి రెండు గంటలు గడిచాయి. రాత్రి పూర్తిగా గడించిందని చెప్పడానికి వీలులేదు కాని.. చీకటి కరగడం మొదలయింది. అటు చీకటి కాదు, ఇటు వెలుగూ కాదు. సందిగ్ధ సమయం. చావుబతుకుల్లో ఉన్న చింతామణి పరిస్థితిలో మార్పేమీలేదు. ఆ రాజ్యం.. ఆమె తల్లితండ్రులు.. అందరి భవిష్యత్తూ, ఆశలూ ఆబిడ్డ మీదే ఉన్నాయి.
చింతామణి నోటనుంచి నురగలు రావడం ముందుగా తల్లి కంటనే పడింది. ఆమె గుండెలు బాదుకుంటూ “అయ్యో! బిడ్డ నురగలు కక్కుతూందండీ! ఇంకేముంది.. నాబిడ్డ లేకుండా నేను బతకలేనండీ.” అంటూ గొల్లు గొల్లున ఏడవసాగింది.
వైద్యుడు చింతామణి నాడి చూసి పెదవి విరిచాడు. అతని ముఖం వెలవెలబోయింది. అది గమనించిన మంజులాదేవి హృదయం పగిలి పోయింది. “నేను పాపిని.. బతకకూడదు..” అని గొణుక్కుంటూ.. లేచి వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోసాగింది. ధర్మపాలుడు, ధీమంతుడు. కొందరు పరిచారకులు ఆమెను అనుసరించారు.
కీర్తికాముడి తల తిరిగిపోతోంది. పాదాలకింద నేల పాతాళంలోకి జారిపోతున్నట్లవుతుంది. కళ్ళు పచ్చబారుతూ ప్రపంచమే అంధకార బంధురం ఔతోంది. కుమార్తెని వొడిలో పెట్టుకుని స్త్రీ కంటే హీనంగా వల వల ఏడవసాగాడు. ఆ మహారాజుని ఎవరు ఓదార్చగలరు?
ఆనందుడు ఇరవయ్యేళ్ళ ప్రాజ్ఞుడే. అతను కూడా గుడ్ల నీరు కుక్కు కోడం తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నాడు. ఎవరికి వారే దుఃఖ సాగరంలో ములిగిపోయారు. కోటలో ఎటుచూసినా హాహాకారాలూ శోకాలూ.
చూపులకి చందమామ.. రాజ్యానికి కాంతి, వంశానికి రాజహంస, మగధరాజ్యానికే మణిపూస. అలాటి చింతామణి మట్టిపాలు కాబోతూంటే ఎవళ్ళు సహించగలరు?
ఆ గదిలోకి – ఒక భటుడు వేగంగా ప్రవేశించాడు. అతను కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బైరాగిని వెంట బెట్టుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టి తాను రాజుకి నమస్కరించాడు.
“ప్రభూ! రక్షకభటులు ఈ సన్యాసిని అనుమానించి గతరాత్రంతా ఖైదులో ఉంచారు. ఇతనికి వైద్యం తెలుసట. అందుకని తీసుకువచ్చాను.” అన్నాడు. అది వినగానే కీర్తి కాముడు ఒడిలోని బిడ్డను పాన్పుమీద పడుకో బెట్టి – లేచి సన్యాసికి నమస్కరిస్తూ – “స్వామీ! నగరపాలకులు ఆచారం పేరిట చేసిన అపరాధాన్ని మన్నించండి. నేనీ దేశపు రాజుని. నా పేరు కీర్తికాముడు. ఈ బిడ్డ నా కూతురు చింతామణి. ప్రాణాలు కోల్పోయినట్లుంది.” అన్నాడు వికారం నిండిన కంఠంతో. బైరాగి ఆమెనాడిని పరీక్షించి – “లేదు. కొంత ఇంకా ఉంది.” అన్నాడు.
దానితో రాజుకీ మిగిలిన వారికీ కూడా ఆశరేకెత్తింది. బైరాగి చింతామణి కాళ్ళూ, చేతులూ తాకుతూ పరిశీలిస్తున్నాడు. ఈ సంతోషవార్తని మంజులాదేవికి చెప్పడానికి ఒక పరిచారిక పరుగుపరుగున వెళ్ళింది.
కోట బావి దగ్గర మంజులాదేవి ఆత్మహత్య చేసుకునే యత్నంలో ఉంది. ఆమెను వారించడానికి అందరూ కష్టపడుతున్నారు. ఎందరు ఎన్ని విధాల చెప్పినా ఆమె చెవికి ఎక్కడం లేదు. బిడ్డని కోల్పోయే సమయంలో తల్లి పొందే దుఃఖమూ, కడుపుమంటా, ఆవేదనా అలాటి తల్లులకి తప్ప ఇతరులకెలా అర్థమౌతాయి?
“నేను పాపిని నన్ను వదలండి. జన్మ జన్మలకీ నా తల్లి నాకు లభింపదు. నా తల్లిలేని లోకంలో నేనుండలేను. నన్ను వారించకండి – ” అంటూ ఆమె నూతి గోడకి తలకొట్టుకోసాగింది. అంతలో –
“దేవీ! ఎవరో బైరాగి మనకోటలోకి వచ్చాడు. రాకుమారిని పరీక్ష్మి చాడు. ప్రాణం పోలేదని చెబుతున్నాడు.” అని పరిచారిక వచ్చి చెప్పేసరికి — “ఆ! నా బిడ్డ బతికుందా?” అంటూ ఆశ్చర్య ఆనందాలతో ఒక్కకేక వేసి మంజులాదేవి పరుగెత్తింది. మిగిలిన వారు కూడా ఆమె వెంట వెళ్ళారు.
కాషాయ వస్త్రాలు ధరించిన బైరాగి ఒక చేతిలో కమండలమూ మరో చేతిలో శంఖమూ పట్టుకొని.. మహారాజుకి ఎదురుగా నిలుచుని రాజకుమారి ముఖంలోకి దీక్షగా చూస్తున్నాడు. శిరసు మీద జటాజూటాన్ని ముడిగా వేసుకున్న అతని ముఖంలో బ్రహ్మ తేజస్సు తాండవిస్తూంది. గడ్డం సవరించుకుంటూ.. దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో మంజులాదేవి వొచ్చి అతని పాదాలమీద పడింది.
“స్వామీ! రక్షించండి. తమరు మహాత్ములే అయ్యుంటారు. నా బిడ్డని బతికించండి. నాకు కడుపు శోకం లేకుండా చెయ్యండి. పుణ్యం కట్టుకొండి. అంటూ దీనంగా ప్రార్థించింది.
అందుకా సన్యాసి – “అమ్మా! ముందు నా పాదాలు వదులు. దేవుడిపై భారముంచి ప్రయత్నం చేస్తా.. ఆ పైన సద్గురు సంకల్పం.” అని.. “ఈ బిడ్డకి వయస్సెంత?” అని ప్రశ్నించాడు.
“పన్నెండో జన్మదినం దాటి వారం రోజులయింది మహర్షి. ఏడు తరాల నుంచీ మా వంశంలో ఆడ సంతతి లేదు. నాకు ఏ సంతానమూ కలగక అనేక యజ్ఞాలూ యాగాలూ చేసి.. ఇక సంతానం కలగదని నిరాశ చెంది ఉండగా.. దేవుడు ఈ బిడ్డని ప్రసాదించాడు. ఏడు తరాల పెద్దలతో నావంశం తరించిందని యీ పన్నెండేళ్ళూ పరమానందం చెందాం. కాని మా మురిపెం ఇంతలోనే ముక్కలౌతుందనుకోలేదు.” అంటూ కీర్తికాముడు విచారించాడు.
“బిడ్డకీ పరిస్థితి ఎంత కాలం నుంచి? కారణమేమిటి?”
రాజు చింతామణి ఉయ్యాల మీంచి పడడం అవీ చెప్పి – “తమ రెవరో మహానుభావులు. అయాచితంగా దయచేశారు. అప్పటికే నిస్పృహ చేసుకున్న మాకు – బిడ్డలో యింకా ప్రాణం నిలచి ఉందని తమరు చెప్పిన మీదట ఆశాంకురం మొలకెత్తింది. మీరాక మా పూర్వపుణ్యమే. ఏ మహత్తు వల్లనైనా తమరు మా బిడ్డని రక్షించగలిగితే నేనూ, నా రాజ్యంలోని వారూ ఆజన్మాంతమూ తమకి దాసులమై పాద సేవ చేసుకుంటాము.” అని వినయంగా మనవి చేసుకున్నాడు.
బాలీక నుదుటి మీది పట్టును కడిగెయ్యమన్నాడు బైరాగి. అందరినీ బయట ఉండమన్నాడు. చేతి సంచిలోంచి చిన్న సీసాను తీసి, దానిలోని చూర్ణాన్ని చిటికెడుతీసి రాజకుమారి ముక్కుకి అందించాడు. రెండు నిముషాల పాటు అలాగే ఉంచాడు. తరవాత శంఖాన్ని పూరించి రాకుమారి చెవి దగ్గర ఊదాడు.
శంఖంలోంచి బయలుదేరిన భీకరనాదానికి కోట భయంకరంగా ప్రతిధ్వనించింది. భూన భోంతరాళాలు దద్దరిల్లాయి. అక్కడున్న వారందరికీ గుండె బేజారైంది. ఆ క్షణమే చింతామణి కళ్ళు తెరచింది. బైరాగి శంఖనాదం ఆపాడు. మంజుల, కీర్తికాముడు, మిగిలినవారు కూడా సంతోషం పట్టలేక బైరాగికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఎన్నో విధాల మొక్కారు.
“అమ్మా! దాహం..” అంది – కళ్ళు విప్పిన రాకుమారి.
“Apoorva Chintamani తరవాతి బాగంలో ఏం జరిగిందో చూదాం “!
Apoorva Chintamani
5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here